నిజామాబాద్, ప్రజా జాగృతి, ఏప్రిల్ 02 : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలలో నిర్వహించిన గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాలలోని 146 వార్డులలో నిర్వహించిన వార్డు సభలు విజయవంతం అయ్యాయి. జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో గ్రామ, వార్డు సభలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఉదయం వేళలోనే 7.30 నుండి 10.30 గంటల వరకు సభలను నిర్వహించారు. ప్రతీచోట నీడ కోసం షామియానాలు, తాగునీరు, కుర్చీలు ఏర్పాటు చేసి, ఫిర్యాదుల బాక్సులు అందుబాటులో ఉంచారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సభలలో భాగస్వాములు కాగా, ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి విజయవంతం చేశారు.

కలెక్టర్ ఇలా త్రిపాఠి మోస్రా మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభతో పాటు, బోధన్ మున్సిపల్ పట్టణంలోని 26, 35 వార్డులలో జరిగిన వార్డు సభలలో పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొనగా, నిజామాబాద్ నగర మేయర్ ఆకుల ఉమారాణి నగర పాలక సంస్థ పరిధిలోని 49వ డివిజన్ కసాబ్ గల్లిలో నిర్వహించిన వార్డు సభలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ లు మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇంచార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దిలీప్ కుమార్ మోపాల్ మండలం తానాఖుర్దు గ్రామ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ లు డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామ సభలో భాగస్వాములయ్యారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ ఏర్గట్ల మండలం తడ్ పాకల్ లో, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో రెంజల్ మండలం దూపల్లి గ్రామ సభలో పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *