చౌటుప్పల్, ప్రజా జాగృతి, ఏప్రిల్ 02 : చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామ పరిధిలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీ కంఠమహేశ్వర గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు మారగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ, భూస్వాములు, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి, గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని పరిపాలించిన ధీరుడు పాపన్న అని కొనియాడారు. మొఘల్ చక్రవర్తులపై దండెత్తిన తొలి తెలంగాణ పోరుబిడ్డగా ఆయన చరిత్రలో నిలిచిపోయారన్నారు. సంఘ కార్యదర్శి మారగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ, అక్రమ భూమి పన్నులకు వ్యతిరేకంగా పోరాడి, అణగారిన వర్గాలకు బానిసత్వం నుండి విముక్తి కల్పించేందుకు గోల్కొండ కోటపై బహుజన జెండాను ఎగురవేసిన ఘనత పాపన్నకే దక్కుతుందన్నారు. గ్రామ సర్పంచ్ రిక్కల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, కులమతాలకు అతీతమైన సమాజం కోసం 350 ఏళ్ల క్రితమే కృషి చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు పాపన్న అని పేర్కొన్నారు. బహుజనులు ఏకమైతే రాజ్యాధికారం సాధ్యమని ఆయన నిరూపించారని, తెలంగాణలో మొఘల్ పాలన అంతానికి ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కందగట్ల సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు బాలగోని శివ యాదవ్, మేకల సందీప్ రెడ్డి, కొత్త ప్రవీణ్ యాదవ్, కొత్త బాలరాజు యాదవ్, సెక్రటరీ భవాని, నాయకులు దయాకర్, మల్లేశం, శంకరయ్య, పల్సం అంజయ్య గౌడ్, డోనూరి ప్రవీణ్ రెడ్డి, గుడ్డేటి మల్లేష్ యాదవ్, పాండు రెడ్డి, నవ్య, సాయి రెడ్డి, రామిరెడ్డి, సుర్కంటి కుమార్ రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *